Saturday, April 23, 2022

Never sleeping tree at tirumala.

 🙏 *తిరుమల సర్వస్వం -24 🙏🏼

జై శ్రీమన్నారాయణ 🙏🏼

 ప్రియ భగవద్ బంధువులారా 🙏🏼

  🙏 *ఓం నమో వేంకటేశాయ 🙏


🙏 *శ్రీవారి ఆలయవైశిష్ట్యం -5* 🙏


*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 

*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


ముందు భాగాల్లో మనం *"సంపంగి ప్రదక్షిణమార్గం"* లో ఉండే విశేషాలను దాదాపుగా తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


🌈 *నీడ తిరగని చింతచెట్టు* 🌈


💫 11వ శతాబ్దంలో భగవద్రామానుజులు; 15వ శతాబ్దంలో అన్నమయ్య; దర్శించి తరించిన ఓ *పరమాద్భుతమైన చింతచెట్టు* శ్రీవారి ఆలయంలో ఉండేది. శ్రీనివాసుని ఆవిర్భావంతో ముడివడిన ఈ వృక్షరాజం యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించే పూర్వాపరాలను శ్రీనివాసుని భక్తులందరూ తెలుసుకుని తీరాలి:


💫 లోక కళ్యాణార్థమై, నారదమహర్షి ఒకానొకప్పుడు తండ్రియైన బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు – 


💫 "తండ్రీ! మీ విన్నపాన్ని ఆలకించి ఆ శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటాచలక్షేత్రంలో అవతరించి భక్తులను అనుగ్రహించే టట్లుగా వరమిచ్చి చాలా కాలమైంది. కావున, ఆ వైకుంఠనాథుని మరలా ప్రార్థించి, సత్వరమే తిరుమల క్షేత్రంలో ప్రత్యక్షమై మానవులందరికీ వారి దర్శనభాగ్యం కలిగింప జేయండి."


💫 ఆ నారదుని ప్రార్థనకు తన సమ్మతిని తెలియజేస్తూ, ఆ మహత్కార్యం నెరవేరటంలో నారదుని పాత్ర ఏమిటో విశదపరచి, బ్రహ్మదేవుడు అతనితో ఈ విధంగా శెలవిచ్చాడు 


💫 *"నేను శేషాద్రిశిఖరాన, స్వామిపుష్కరిణి సమీపంలో, త్రేతాయుగపు దశరథ మహారాజు అంశతో మరియు ద్వాపరయుగపు వసుదేవుని అంశతో ఓ చింతచెట్టును సృష్టిస్తాను. ఆ వృక్షఛాయలో శ్రీరాముని తల్లి కౌసల్య అంశతో మరియు శ్రీకృష్ణుని తల్లి దేవకి అంశతో ఓ విశాలమైన పుట్టను ఏర్పాటు చేస్తాను. వీళ్ళనే ఎందుకు ఎన్నుకున్నానంటే; ఆయా పుణ్యదంపతులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే శ్రీరామ-శ్రీకృష్ణుల రూపాలలో త్రేతాయుగం-ద్వాపరయుగాల్లో తనయుడుగా జన్మించినప్పటికీ, కారణాంతరాల వల్ల వారికి అనతికాలం లోనే పుత్ర వియోగం సంభవించింది. శ్రీరాముని వనవాసంతో కౌసల్యాదశరథులు పరితపించగా, కారాగారంలో జన్మించగానే శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు దూరమయ్యాడు. వారికి పుత్రునిపై మమకారం తీరనేలేదు. అలాగే, చిన్నికృష్ణుణ్ణి అత్యంత ప్రేమాభిమానాలతో పెంచుకున్న యశోదమ్మ, శ్రీకృష్ణుని వివాహాన్ని చూడలేక పోయింది. కావున కలియుగంలో ఆమెను వకుళమాతగా జన్మింపజేసి శ్రీనివాసుని కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించే ఏర్పాటు కూడా చేయాలని ఎప్పుడో నిశ్చయించు కున్నాను".*


💫 అలా బ్రహ్మదేవుడు వచించినదే తడవుగా వేంకటాచలంలో ఓ చింతచెట్టూ, దానిక్రింద పుట్ట (వల్మీకం), వకుళమాత చెకచెకా సృష్టించబడ్డాయి.


💫 తండ్రియానతి మేరకు కార్యరంగంలోకి దిగిన నారదమహర్షి, వైకుంఠవాసుణ్ణి వల్మీకవాసునిగా తయారుచేసే ప్రయత్నంలో పడ్డాడు. 


💫 అదే సమయంలో, యోగిపుంగవులందరూ కలిసి ఓ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞానికి విచ్చేసిన కలహభోజనుడు, త్రిమూర్తుల్లో అత్యంత మహిమాన్వితునికి మాత్రమే యజ్ఞఫలాన్ని ధారపోయవలసిందిగా సలహా ఇచ్చాడు. త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో నిగ్గు తేల్చటం కోసం, మహర్షుల కోర్కె మేరకు బ్రహ్మనూ, మహేశ్వరుణ్ణి దర్శించిన భృగుమహర్షి చివరగా వైకుంఠానికేతెంచాడు. ఆ తరువాత క్షణికావేశానికి గురైన భృగుడు - లక్ష్మీనివాసమైన శ్రీనివాసుని హృదయంపై కాలితో తన్నడం; క్రోధితురాలైన శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వదలి *కరివీరపురానికి (నేటి కొల్హాపూరుకు)* చేరడం; విష్ణువు, లక్ష్మీదేవి జాడ వెతుకుతూ భూలోకానికేతెంచి వేంకటాచలంలో చింతచెట్టు క్రిందున్న పుట్టలో సేదతీరడం; ఓ గొల్లవాని గొడ్డలిదెబ్బకు గాయపడిన శ్రీనివాసుడు పుట్టలో నుండి బయటకు వచ్చి వకుళమాత చెంత చేరి పద్మావతిని పరిణయమాడటం మనకు సుపరిచితమే! ఇందులో కొంత భాగాన్ని మనం "సన్నిధి గొల్ల" ప్రకరణంలో తెలుసుకున్నాం కూడా.


💫 కాలాంతరాన ఆ పుట్ట సమీపంలో తొండమానునిచే శ్రీవారికి ఆలయం నిర్మించబడడంతో ఓ ప్రాకారం ఏర్పడి, ఆ చెట్టు సంపంగి ప్రదక్షిణమార్గంలో మహాద్వారానికి చేరువగా నిల్చింది.


💫 ఆ చింతచెట్టు కాండం దృఢంగా ఉండి శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ చెట్టు నీడ ఎటూ తిరగక వృక్షమూలంలోనే స్థిరంగా ఉండటంతో అది *"నీడ తిరుగని చింతచెట్టు"* గా ప్రసిద్ధి చెందింది. అంతే గాకుండా, ఆ చెట్టు విశ్రాంతి యన్నదే లేకుండా చిగురిస్తూ, పుష్పిస్తూ, ఫలిస్తూ ఉండేది. అందువల్ల అది *"ఉన్నిద్ర తింత్రిణీ వృక్షం" (నిద్రపోని చింత చెట్టు)* గా కూడా పేరొందింది. కాలక్రమాన, భూలోకంలో తనకు మొట్టమొదటి సారిగా నీడ కల్పించిన ఆ వృక్షం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్ర మయ్యింది. 


💫 ఒకానొకప్పుడు ఆ లక్ష్మీవల్లభుడు తన భక్తుడైన తొండమానునితో, "ఆ చింతచెట్టునూ, మహాలక్ష్మికి ఆవాస స్థానమైన చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి, మిగిలిన చెట్లనన్నింటినీ తొలగించి ఆలయప్రాకారాలు నిర్మించవలసిందిగా" ఆదేశించినట్లు వెంగమాంబ విరచిత "వేంకటాచలమహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.


💫 ప్రస్తుతం ఆలయంలో కానరాని ఆ వృక్షం ఎప్పుడు, ఎలా కనుమరుగైందో ఎవరికీ తెలియదు. తన కార్యం పరిసమాప్తి చెందడంతో బ్రహ్మదేవుడే ఆ వృక్షాన్ని తనలో తిరిగి ఐక్యం చేసుకున్నాడేమో!


💫 11వ శతాబ్దంలో భగవద్రామానుజులు ఆ చింతచెట్టును దర్శించి తరించినట్లు "పరమయోగివిలాసం" అనే ప్రామాణిక గ్రంథంలో వ్రాయబడింది. అలాగే, 15వ శతాబ్దంలో అన్నమయ్య తొలిసారిగా తిరుమల యాత్ర చేసినపుడు -


*కుందనపు బొలుపుల పెద గోపురము సేవించి* 

*తరగని ఫలపుష్ప తతి తోడ నీడ తిరుగని* 

*చింత వర్తిల నమ్రుడగుచు."*


అనే కీర్తనలో, ఈ చింతచెట్టును దర్శించు కున్నట్లుగా పేర్కొన్నాడు.


💫 సాక్షాత్తు శ్రీనివాసునికే నీడనిచ్చిన ఆ వృక్షరాజం, *"మానవుడు ఐహిక ప్రలోభాలకు లోనై తన దిశను మార్చుకోకుండా; అజ్ఞానాంధకారపు ఛాయలను దరిజేర నీయకుండా; ఆ పరమాత్ముని సాక్షాత్కారం కోసం అలుపెరుగని సాధన చేయాలని; జన్మ సార్థక్యం కాగానే నిశ్శబ్దంగా నిష్క్రమించాలని"* సూచిస్తుంది.


🌈 *వెండివాకిలి* 🌈


💫 ప్రప్రథమ ప్రాకారం లోని మహాద్వారం గుండా ప్రవేశించి, సంపంగి ప్రదక్షిణమార్గం లోని వివిధ మండపాలను దర్శించుకొని, ధ్వజస్తంభ దర్శనం తరువాత మనం వెండివాకిలి ముందుకు చేరుకుంటాం. ఈ ప్రవేశద్వారం యొక్క, గడపలకూ, ప్రక్కనున్న గోడలకూ వెండితాపడం చేసి యుండడం వల్ల దీన్ని "వెండివాకిలి" గా పిలుస్తారు. అలాగే, రెండవ ప్రవేశద్వారం కావటం వల్ల దీనిని *"నడిమి పడికావలి"* గా కూడా వ్యవహరిస్తారు. 


💫 1929వ సం. లో, నైజాం ఎస్టేటుకు చెందిన "శ్రీరాం ద్వారకా దాస్ పర్భణి" అనే భక్తుడు ఈ వాకిళ్ళకు వెండితాపడం చేయించినట్లుగా ఆ తలుపులపై హిందీ, ఆంగ్లభాషల్లో వ్రాయబడి ఉంది. సంపంగి ప్రాకారానికి అనుసంధానమై ఉండే ఈ ద్వారంపై ఏడు కలశాలతో, శిల్పకళా శోభితమైన మూడంతస్తుల గోపురం నిర్మించబడింది.


💫 వెండివాకిలికి ఇరుప్రక్కలా ఉన్న కుడ్యాలపై, హాథీరాంబాబా-వేంకటేశ్వరుల పాచికలాట శ్రీరామపట్టాభిషేకం ఘట్టాలు హృద్యంగా చెక్కబడి వెండి రేకుతో తాపడం కావించబడ్డాయి.


💫 12వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ కుడ్య-ద్వార-గోపుర నిర్మాణం అంచెలంచెలుగా చేకూరి; 13వ శతాబ్దంలో పూర్తయినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ వెండివాకిలి దాటగానే మనం మూడవ లేదా విమాన ప్రదక్షిణమార్గం లోనికి ప్రవేశిస్తాం.


💫 అయితే, అంతకు ముందుగా శ్రీవారి ఆలయ మహాద్వారం ముందున్న ఓ ముఖ్యమైన మంటపాన్ని గూర్చి తెలుసుకుందాం:


🌈 *గొల్లమంటపం* 🌈


💫 పూర్వకాలంలో శ్రీవారి ఉత్సవాలు - తిరుచానూరులో జరిగేవి. అవన్నీ శ్రీవారి నివాస స్థానమైన "తిరుమలక్షేత్రం" లోనే జరగాలని 11వ శతాబ్దంలో రామానుజులవారు తీర్మానించారు. అందునిమిత్తం తిరుమల కొండను అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమైన కూలీలకు, పర్యవేక్షకులకు చంద్రగిరికి చెందిన "గోపమ్మ" అనబడే ఓ గొల్లవనిత చల్లని మజ్జిగ నిచ్చి దాహం తీర్చేది. ఆమె సేవకు మెచ్చిన రామానుజాచార్యులు ఏ వరం కావాలో కోరుకొమ్మనగా, ఆ వనిత అమాయకంగా, "తమరు చీటీ రాసిస్తే మోక్షమొస్తుందట. ఓ చీటీ రాసి మోక్షమిప్పియ్యండి" అని బదులిచ్చింది. ఆమె నిష్కల్మషత్వానికి మెచ్చిన రామానుజులు, ఓ తాళపత్రంపై *"శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక"* అని వ్రాసి ఆమె చేతిలో నుంచారు. ఆ గొల్లవనిత సేవానిరతికి, మోక్షపిపాసకు, నిష్కళంకభక్తికి గుర్తుగా, రామానుజుని ప్రేరణతో ఆ ప్రదేశంలో  *"గొల్లమంటపం"* నిర్మించబడింది.


💫 మరో కథనం ప్రకారం, మజ్జిగ విక్రయాలతో సంపాదించిన డబ్బుతో స్వయంగా ఓ గోపవనితే, ఆమెకు స్వామివారిపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు గుర్తుగా ఈ మంటపాన్ని నిర్మించింది.


💫 కథనమేదైనప్పటికీ, ద్వాపరంలో గోవిందునికి- గోపాలురకు ఉన్న బాంధవ్యం కొనసాగుతూ; కలియుగంలో శ్రీవేంకటేశ్వరునికీ-గొల్లలకూ మధ్య ఏర్పడ్డ అనుబంధం ఈ *"గొల్లమంటపం"* రూపంలో ద్యోతక మవుతోంది.


💫 1470వ సం. లో నిర్మించబడిన ఈ కట్టడంలో నిలబడి ఒకప్పుడు ప్రధానార్చకులు ప్రతినిత్యం ఘంటానాదం చేసిన కారణంగా దీనికి *"ఘంటామండపమ"* నే మరో పేరు కూడా వచ్చింది.


💫 ఈ మంటపం శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఎదురుగా, సమున్నతంగా నిలబడి ఉంటుంది. శ్రీవారి ఉత్సవ వాహనాలు మహాద్వారానికీ, గొల్లమంటపానికి మధ్య నుండి సొగిపోతాయి.


💫 ఇప్పటివరకు, సంపంగి ప్రదక్షిణమార్గంలోని ప్రతిమా, మంటప, ఇతర కట్టడాల విశేషాలన్నింటినీ తెలుసుకున్నాం.


💫 ఇవే కాకుండా అన్ని మంటపాల్లోని కుడ్యాలపై, స్తంభాలపై, పైకప్పు లోపలిభాగంలో లతాపుష్ప ఆకృతులు, జంతువులు, పక్షుల చిత్రాలు, ఏనుగు తలపైనున్న గుర్రం, ఆ గుర్రంపై స్వారీ చేస్తున్న యోధుడు, వివిధ దేవతా శిల్పాలు; పూతనవధ, గోపికావస్త్రాపహరణం వంటి పౌరాణిక ఘట్టాలు; ఆదిశేషుడు, హనుమ, గరుడిని శిల్పాలు; ఇంకా అనేక కళాకృతులు ముగ్ధమనోహరంగా చెక్కబడి ఉన్నాయి. వీటినన్నింటినీ వీలున్నంతలో వీక్షించాల్సిందే గానీ, వాటి శోభను వర్ణింపనలవి కాదు.


💫 వెండివాకిలిని దాటి మనం ఇక మూడవ ప్రదక్షిణం, అంటే *"విమానప్రక్షిణమార్గం"* లోనికి చేరుకోవడమే తరువాయి.


💫 అయితే, ఆ ప్రదక్షిణం చేసే ముందుగా కొన్ని శ్రీవారి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. 


💫 *నిత్య, వార, మాస ఉత్సవ* విశేషాలను ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి, కొన్ని *"సంవత్సరోత్సవాల"* గురించి కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం.


[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం*  గురించి మరిన్ని  విశేషాలు తెలుసుకుందాం]


🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం.


          సశేషం...*


💥ఓం నమోవేంకటేశాయ 💥

No comments: